Saturday, 25 June 2016


మా ఊరి కరణం గారు

మా ఊరి కరణం గారు

         మా ఊరి కరణం గారు అంటే ఎవరో అనుకునేరు మా తాతగారు స్వర్గీయ పెమ్మరాజు గోపాల కృష్ణమూర్తి గారే నండి . అంతగా మా ఊరి కరణం గారు అనే చెప్పేకి ఒక కారణం ఉందండి ..మా తాతగారు నాకు ఊహ తెలిసిన నాటి కే ఆయన ఎప్పుడు తెల్లటి పైజామా లాల్చీ వేస్కుని సింధూరం తో నుదిటిన నిలువు బొట్టు పెట్టుకుని దాని కింద చిన్న విబూది రేఖ దిద్దుకునే వారు .రెండు చెవులకి రెండు చిన్న బంగారపు పోగులు ఉండేవి. ఆజానుబాహుడని అనను గాని ఒక మోస్తరు ఒడ్డు పొడవు కలిగిన అందగాడే ఆయన. ఇంచుమించు గా ఆయన 12 వ ఏటా ఆయన తండ్రి చనిపోతే ఒక అక్క,ఒక చెల్లాయి నలుగురి తమ్ముల బాధ్యత భుజాన వేసుకోక తప్పింది కాదు,వారి ఊరి షావుకారు ల దగ్గర పద్దులు రాస్తూ సంసారాన్ని లాకొచ్చారుట ,20 ఏళ్ల వయస్సు నాటికి బొడ్డేపల్లి గ్రామానికి కరణం గా నియమించబడ్డారు ,అయితే 1984 లో తెలుగు దేశం ప్రభుత్వ హయం లో కరణం పదవి కి మనగలం పాడారు మన ప్రభుత్వం వారు. అలా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈయన  కరణం కాదు.

         కానీ విచిత్రం ఎంటంటే ప్రభుత్వం వారు ఎవరి నైనా VAO గా నియమించిన ఆయన కాలం చెసే వరకు ఆయనే ఆ ఊరికి కారణం ఎవరు పొలం కొనాలన్నా అమ్మాలన్న మా ఊరి మా తాతగారి చేతివ్రాలు లేందే ఆ దస్తావేజు పని నడవదు. ఆ చేతివ్రాలు చూసి తీరలండి అచ్చ్చంగ ముత్యాలు వరస పెట్టి పేర్చినట్టే ఉండేదంటే నమ్మండి. కొలతలోను ఇతర భూమి సంభందిత వ్యవహారాల్లోనూ ఆయన్ను కొట్టిన వాడు లేడు . అంతే  కాదండి  అవడానికి ఆయన స్కూల్ ఫైనల్ పాస్ ఐ నప్పటికీ ఆయనికి ప్రవేశం లేని విద్య లేదు.దేశ రాజకీయాల దగ్గర నుంచి,మార్కెట్ లో బేరసారాలు,ఇంటి వైద్యం ,దీపావళి మందుగుండు సామాను తయారు చేయడం,ఇంతే కాదండి ఇహ పాక శాస్త్ర ప్రావీణ్యం అయితే అబ్బా తలచుకుంటేనే నోరు వూరిపోతుందంటే నమ్మండి,ఆయన చేతి తో చేసిన చక్కర పొంగలి,పనసపొట్టు కూర రుచి ఎప్పటికి మరువలేను . వినాయక చవితి వచ్చిందంటంటే నేను,మా తమ్ముడు వీధులన్నీ తిరిగి పత్రి పోగెయ్యాలి,అందులో రకరకాల పత్రి ని ఎలా పోల్చాలో ఆయనే దగ్గరుండి నేర్పేవారు . మట్టి వినాయకుణ్ణి తయారుచేసుకోవడం,పూజ దగ్గరుండి చేయించేవారు.
        ఇంతకీ ఆయనని మా ఊరి కరణం గారు అన్న కారణం ఏంటంటే ప్రభుత్వం వారు ఎవరి నైనా నియమించుకోనివ్వండి మా ఊరి వారు మాత్రం ప్రతి వ్యవహారానికి మా తాతగారిని తీసుకెళ్లి ఆయన సలహా తోనే పని జరిపించుకునే వారు. ఇప్పటికి మా ఊరి లో బ్రాహ్మణ వీధి లో మొదటి  ఇల్లు ఎవరిదని అడగండి కరణం గారి ఇళ్లనే చెబుతారు,నిజానికి ఆ ఇల్లు ఆ వూరు మేము వదిలి దశాబ్దం పైన అయింది,మా కరణం తాతగారు మమల్ని వదిలిపెట్టి ఎనిమిది సంవత్సరాలు అవుతోంది,ఉద్యోగ రీత్యా రోజు చాలా మంది ని కలుస్తాను గాని ఆయన వంటి బహుముఖ ప్రగ్యశాలిని మాత్రం బహుశా మళ్ళీ చూడలేను ,ఒక ఉన్నతమైన అధికారి గానే కాదు,ఎంతో మంచి ఊరి పెద్ద గా,ఇంటి పెద్దగా,అర్ధంచేసుకుని ప్రేమించే భర్తగా ,తండ్రి గా ఆయన బాధ్యతలను పోయే వరకు చక్కగా నిర్వహించే వారు ఆయన ఏ  రోజు తెల్లవారి 5 గంటల తర్వాత పడుకోవడం మేము చూడలేదు. వేకువజామునే లేచి సుప్రభాతం చదువుకోవడం తో మొదలయ్యేది ఆయన దినచర్య. ఇంచుమించు గా ఎనభైయో పడి లో కాలం చేశారు మా తాతగారు అప్పటి వరకు బీపీ గాని సుగర్ గాని ఆయనెరుగరు అంటే ఎంత చక్కటి జీవన శైలి కదా. ఆయనకి ఏ రోజు రేపటి గురించిన చింత లేదు లేని పోనీ ఆదుర్దా లేదు భగవంతుడు మనకి ఇచ్చినదానిలో నలుగురికి చక్కగా పెడుతూ బ్రతికి నంత కాలం సంపూర్ణమైన ఆనందమైన జీవితం అనుభవించిన అదృష్టశాలి .