Tuesday, 12 July 2016

వృక్ష విలాపం

   భుజాన గొడ్డలి పట్టుకుని ప్రభుత్వం వారి ఉపాధి హామీ పధకం పుణ్యమాని ఈ పూటకి డబ్బులు వస్తాయి గంద ఆ వచ్చిన డబ్బు ఎట్టా తగ్గలేయాలా అని ఆలోసిత్తా రోడ్డు నిర్మాణానికి అడ్డంగా ఉంది గాన కొట్టెయ్యమని సదరు ప్రభుత్వం వారు ఇచ్చిన పనిని చేయడానికి గొడ్డలిని ఎత్తి ఒక్క దెబ్బ వెయ్యబోయాడు ఆ పెద్ద చెట్టు మీద అప్పన్న.

      ఇంతలో "అయ్యో నన్ను సంపమాకు " అని ఒక గొంతు వినపడింది బయపడి చుట్టూ చూసాడు అప్పన్న ఎవరు కనపడలేదు,అయితే రాత్రి తాగిన సారా మత్తు దిగలేదని తనని తానే తిట్టుకొని మళ్ళీ వేటు వేసేందుకు సిద్దమయ్యాడు అప్పన్న ఇంకోసారి అదే గొంతు వినపడింది . నిసింతంగా పరిశీలించాడు అప్పన్న అప్పుడర్ధమైంది  తనకి ఆ గొంతు వినిపిస్తోంది తాను నరకబోయిన చెట్టు నుంచి అని.

      నిమ్మతంగా సెట్టు కాడ కూకొని" ఏందిరా అయ్యా ఏంది నీ యవ్వారం బలే సిత్రంగా వుందే నువ్వు మాట్లాడడమేంది సోద్యం కాపోతేనూ" .అతని మాట విన్న చెట్టు ఏడుస్తూ  "మేము ఇచ్చే తిండి తిని,మమ్మల్నే నరకతా ఉంటే సోద్యం చూస్తాము అనుకోకు, ఒక్క సారి మా జాతి లేని మీ జీవితాన్ని ఊహించుకో ,తింటానికి తిండి ఉండదు,ఉండేందుకు గూడు ఉండదు ,ఆఖరికి మా వృక్ష జాతి లేకుండా భూమి లో నీరు నిలవదు,మీకు పంటలు పాండవు,నీరు నిలవుండదు,అంతెందుకు మీరు పీల్చే గాలే ఉండదు. ఇన్ని విధాలుగా మీ మడుసులకి మేము ఉపోయోగపడ్తామ్ గంద ,మామంతే మీకు కూసంత జాలైన లేకుండా పెభుత్వం వారు ఇచ్చే కూలి పైసల కోసం నా ప్రాణం తీస్తావా,అసలా  నీకు కుతంతైనా ఇశ్వాసం ఉందా అంటూ కన్నెర్ర జేసింది ఆ మహావృక్షం .

      ఆ మహావృక్షం కురిపించిన ప్రశ్నల వర్షానికి దెబ్బకి తల తిరిగిపోయింది అప్పన్న కి "మరి నిన్ను కొట్టక పోతే నాకు కూలెట్టా దొరుకుద్ది " అన్నాడు అమాయకంగా ,అప్పుడు ఆ వృక్షరాజం "ఒరేయ్ ఎర్రోడా మీ తాత తండ్రి ఇద్దరు నేల తల్లి ని నమ్ముకుని వ్యవసాయం చేశారు ,నువ్వు మాత్రం ఈ పట్నవాసం మీద మోజు కొద్దీ ఆడ నేల తల్లిని బీటలు పడేలా చేసి ఏదో సంపాదించి పాతరేద్దామని వచ్చి ఏ  మాత్రం సంపాదించావు  అని నువ్వే సెప్పాల "

     "నిజమే రా అయ్యా నువ్వన్నది నిజమే ఈడ ఉండడానికి సరైన గూడు లేదు,ఇక్కడ వెచ్చాల ఖరీదుకి ఒకపూట తింటే ఒకపూట పస్తుంటున్నాం ,ఇహ ఇస్కూలు చదువులైతే మా ఊహకు కూడా అందవు ,ఈ బాధలన్నీ మర్చిపోడానికి తాగుడికి అలవాటడిపోనాను ,ఇంట  బయట సుఖం నేదు "

         అప్పన్న చెప్పిందంతా విని ఆ మహావృక్షం దీర్ఘంగా నిటుర్చి "ఈ పట్నవాసం లో ఉదహరించిన కాడికి సాను గాని ఇక నైనా మీరు ఊరు పోయి వున్న కాస్త పొలం యవసాయం సేస్కోని హాయిగా ఉండు " అంటూ గీతలో కృష్ణుడికి మల్లె కర్తవ్యబోధ చేసింది మన అప్పడికి .
        

Monday, 11 July 2016

ముచ్చటైన మనసు



ముచ్చటైన మనసు
 ఈ మధ్యకాలం లో నేను చూసిన లఘు చిత్రాలలో నిజంగానే చాలా ముచ్చటగా ఉంది "మనసు "(manasu) చిత్రం .వీణ వేదిక(veenaa vedika) వారు తీసిన ఈ చిత్రం లో ప్రముఖ నటులు శ్రీ వంకాయల సత్యనారాయణ గారు ముఖ్య పాత్రధారి కాగా,మిగతా నటీనటులు అంతా కూడా ఇది వర లో కొన్ని లఘు చిత్రాలలో నటించినవారే . 
         లఘు చిత్రాలకి సాధారణ చలన చిత్రాలకి ఉన్నంత నిడివి ఉండదు ,సాధారణంగా 40 నిమిషాలు నుండి గంట సేపు లోపే వారు తెరకెక్కించాల్సిన అంశాలను టూకీగా చెప్పాలి .ఇలా వారు చెప్పదల్చుకున్న అంశాన్ని "మనసుకి " హత్తుకునేలా చెప్పడం లో దర్శకుడు శ్రీ త్రివిక్రమ్ గాజులపల్లి(Trivikram Gajulapalli)  గారు విజయం సాదించారనడం లో ఎటువంటి సందేహం లేదు .

         వార్ధక్యం లో భార్య కాలం చేయగా కొడుకు దగ్గర సమయం వెళ్ళబుచ్చుతుంటారు  కృష్ణా రావు  గారు ,ఒకరోజు ఆయన భార్య తాలూకు కాళీ మెట్టే అనుకోకుండా తారస పడుతుంది ,అప్పుడు జ్ఞాపకం వస్తుంది పెద్దాయనికి ఆ రోజు తన పెళ్లి రోజు అని,వెంటనే మనసు వుండబట్టక  భార్యని జ్ఞాపకాలలో వెతుక్కొనేందుకు వారి స్వగ్రామం చేరుకుంటారు.
               ఊరి లో తన బాల్యమిత్రుడు లక్ష్మీ తో తమ చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ,ఇద్దరు చిన్నపిల్లల్లా పులి-మేక ఆదుకోవడం,మీసాలకు రంగులు దిద్దడం లాంటి సరదాగా కాలాన్ని గడపడమే కాక తన భార్య తో తన కు గల అనుబంధాన్ని ,ఆమె చనిపోయిన నాటి నుండి తాను మృత్యువు ని తలుచుకొని భయపడుతూ కాలాన్ని ఎలా గడుపుతున్నది  చెప్పలేక చెప్పలేక తన స్నేహితుడికి చెప్పుకుంటారు కృష్ణా రావు గారు.

        అది విన్న ఆయన స్నేహితుడు మృత్యువు అనేది అందరికి ఏదో ఒకనాడు చేరవలసిన దరి అని,అయితే దాని కోసం భయపడుతూ ఎప్పుడు చస్తూ బ్రతక కూడదని "బంధాల్ని తెంచుకొని పాశాలని  తుంచుకొని శిశిరానికి శిరస్సు  వంచి ఆకు వదలదా కొమ్మల్ని " అంటూ జీవిత సత్యాన్ని ఆయనకి గుర్తు చేస్తారు .అలా తన స్నేహితుని తో "మనసు" లో మాట పంచుకొని ,తేలికపడ్డ మనసుతో నిద్రకు ఉపక్రమించి అనుకోకుండా శాశ్వత నిద్ర లో కి జారుకుంటారు కృష్ణరావు .
          అయితే బ్రతికినంత కాలం తమ ఊరిలో అందరికి తలలో నాలుకలా వుంటూ మంచి,చెడు చెప్పే పెద్దమనిషి కృష్ణారావు గారు తన ఊరికి ఏదైనా చేయాలన్న తపన పడుతుంటారు .ఆ విషయమే ఆయన తన పుస్తకంలో రాసుకుంటారు .ఆయన తదనంతరం ఆయన "మనసు" తెలుసుకున్న ఆయన కుమారుడు,స్నేహితుడు కృష్ణారావు గారి జ్ఞాపకార్ధం ఒక పాఠశాల నిర్మించి ఊరిలో లో అక్షరాస్యత ను పెంపొందించే దిశగా అడుగులు వేస్తారు.

           దర్శకుడు తీసుకున్న అంశం సాధారణమైన వ్యక్తి జీవితమే అయినా "ముచత్తైన" మనసు అని ఎందుకని అన్నాను అంటే సహజంగా వార్ధక్యపు పడి లో ఉన్నవారి మనో భావాల్ని కళ్ళకి కట్టినట్టు ,గుండెలకి హత్తుకునేలా చాలా చక్కగా తెరకెక్కించారు. ఆ వయసులో వారు కోరుకునేది పిల్లలు వారితో సమయం గడపాలని,తమ మనసు తెలుసుకోవాలని ఇది చాలా చిన్న కొరికి లా కనిపించినా మారుతున్న జీవన క్రమం తరాల మధ్య అగాధలను ఏర్పరుస్తోందని దాని మీద "మనసు అనే ఆనకట్ట నిర్మించుకుంటేనే బంధాల్ని పదిలపరుచుకోవచ్చు అని సున్నితంగా సందేశాన్ని అందించారు.

      మన ఆలోచనలన్నిటిని నిర్దారించగలిగేది మనసు,మనము దాని చేతిలో కీలు బొమ్మ కారాదని ,మన చేతలు మన ఆలోచనలు మనం పోయిన అజరామరంగా ఉండాలని ,ఇంతేకాక ఎంత కాలం బ్రతికాము అనే దాని కంటే ఎలా బ్రతికామనేది ముఖ్యం అనే నీతి ని  చక్కగా చిత్రీకరించారు.
 " మనసు " చిత్రం నాట వారి షార్ట్ ఫిల్మ్ విభాగం లో మొదటి బహుమతి పొందింది ,ఈ చిత్రం ఇచ్చిన అనుభవంతో దర్శకులు  "కారందోస"(karam dosa)  అనే చలన చిత్రం తెరకెక్కిస్తున్నారు.

       
              

Saturday, 25 June 2016


మా ఊరి కరణం గారు

మా ఊరి కరణం గారు

         మా ఊరి కరణం గారు అంటే ఎవరో అనుకునేరు మా తాతగారు స్వర్గీయ పెమ్మరాజు గోపాల కృష్ణమూర్తి గారే నండి . అంతగా మా ఊరి కరణం గారు అనే చెప్పేకి ఒక కారణం ఉందండి ..మా తాతగారు నాకు ఊహ తెలిసిన నాటి కే ఆయన ఎప్పుడు తెల్లటి పైజామా లాల్చీ వేస్కుని సింధూరం తో నుదిటిన నిలువు బొట్టు పెట్టుకుని దాని కింద చిన్న విబూది రేఖ దిద్దుకునే వారు .రెండు చెవులకి రెండు చిన్న బంగారపు పోగులు ఉండేవి. ఆజానుబాహుడని అనను గాని ఒక మోస్తరు ఒడ్డు పొడవు కలిగిన అందగాడే ఆయన. ఇంచుమించు గా ఆయన 12 వ ఏటా ఆయన తండ్రి చనిపోతే ఒక అక్క,ఒక చెల్లాయి నలుగురి తమ్ముల బాధ్యత భుజాన వేసుకోక తప్పింది కాదు,వారి ఊరి షావుకారు ల దగ్గర పద్దులు రాస్తూ సంసారాన్ని లాకొచ్చారుట ,20 ఏళ్ల వయస్సు నాటికి బొడ్డేపల్లి గ్రామానికి కరణం గా నియమించబడ్డారు ,అయితే 1984 లో తెలుగు దేశం ప్రభుత్వ హయం లో కరణం పదవి కి మనగలం పాడారు మన ప్రభుత్వం వారు. అలా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈయన  కరణం కాదు.

         కానీ విచిత్రం ఎంటంటే ప్రభుత్వం వారు ఎవరి నైనా VAO గా నియమించిన ఆయన కాలం చెసే వరకు ఆయనే ఆ ఊరికి కారణం ఎవరు పొలం కొనాలన్నా అమ్మాలన్న మా ఊరి మా తాతగారి చేతివ్రాలు లేందే ఆ దస్తావేజు పని నడవదు. ఆ చేతివ్రాలు చూసి తీరలండి అచ్చ్చంగ ముత్యాలు వరస పెట్టి పేర్చినట్టే ఉండేదంటే నమ్మండి. కొలతలోను ఇతర భూమి సంభందిత వ్యవహారాల్లోనూ ఆయన్ను కొట్టిన వాడు లేడు . అంతే  కాదండి  అవడానికి ఆయన స్కూల్ ఫైనల్ పాస్ ఐ నప్పటికీ ఆయనికి ప్రవేశం లేని విద్య లేదు.దేశ రాజకీయాల దగ్గర నుంచి,మార్కెట్ లో బేరసారాలు,ఇంటి వైద్యం ,దీపావళి మందుగుండు సామాను తయారు చేయడం,ఇంతే కాదండి ఇహ పాక శాస్త్ర ప్రావీణ్యం అయితే అబ్బా తలచుకుంటేనే నోరు వూరిపోతుందంటే నమ్మండి,ఆయన చేతి తో చేసిన చక్కర పొంగలి,పనసపొట్టు కూర రుచి ఎప్పటికి మరువలేను . వినాయక చవితి వచ్చిందంటంటే నేను,మా తమ్ముడు వీధులన్నీ తిరిగి పత్రి పోగెయ్యాలి,అందులో రకరకాల పత్రి ని ఎలా పోల్చాలో ఆయనే దగ్గరుండి నేర్పేవారు . మట్టి వినాయకుణ్ణి తయారుచేసుకోవడం,పూజ దగ్గరుండి చేయించేవారు.
        ఇంతకీ ఆయనని మా ఊరి కరణం గారు అన్న కారణం ఏంటంటే ప్రభుత్వం వారు ఎవరి నైనా నియమించుకోనివ్వండి మా ఊరి వారు మాత్రం ప్రతి వ్యవహారానికి మా తాతగారిని తీసుకెళ్లి ఆయన సలహా తోనే పని జరిపించుకునే వారు. ఇప్పటికి మా ఊరి లో బ్రాహ్మణ వీధి లో మొదటి  ఇల్లు ఎవరిదని అడగండి కరణం గారి ఇళ్లనే చెబుతారు,నిజానికి ఆ ఇల్లు ఆ వూరు మేము వదిలి దశాబ్దం పైన అయింది,మా కరణం తాతగారు మమల్ని వదిలిపెట్టి ఎనిమిది సంవత్సరాలు అవుతోంది,ఉద్యోగ రీత్యా రోజు చాలా మంది ని కలుస్తాను గాని ఆయన వంటి బహుముఖ ప్రగ్యశాలిని మాత్రం బహుశా మళ్ళీ చూడలేను ,ఒక ఉన్నతమైన అధికారి గానే కాదు,ఎంతో మంచి ఊరి పెద్ద గా,ఇంటి పెద్దగా,అర్ధంచేసుకుని ప్రేమించే భర్తగా ,తండ్రి గా ఆయన బాధ్యతలను పోయే వరకు చక్కగా నిర్వహించే వారు ఆయన ఏ  రోజు తెల్లవారి 5 గంటల తర్వాత పడుకోవడం మేము చూడలేదు. వేకువజామునే లేచి సుప్రభాతం చదువుకోవడం తో మొదలయ్యేది ఆయన దినచర్య. ఇంచుమించు గా ఎనభైయో పడి లో కాలం చేశారు మా తాతగారు అప్పటి వరకు బీపీ గాని సుగర్ గాని ఆయనెరుగరు అంటే ఎంత చక్కటి జీవన శైలి కదా. ఆయనకి ఏ రోజు రేపటి గురించిన చింత లేదు లేని పోనీ ఆదుర్దా లేదు భగవంతుడు మనకి ఇచ్చినదానిలో నలుగురికి చక్కగా పెడుతూ బ్రతికి నంత కాలం సంపూర్ణమైన ఆనందమైన జీవితం అనుభవించిన అదృష్టశాలి . 

Sunday, 1 May 2016

ప్రతి రోజు ఒక్క కొత్త పాఠం చదువుకుంటూ పద

ప్రతి రోజు ఒక్క కొత్త పాఠం చదువుకుంటూ పద 

ఇది ఒక ప్రముఖ తెలుగు చిత్రం లోని గీతం ఇది విన్నపుడు మొదట ఆలోచన వచ్చింది ప్రతి రోజు ఒక్క కొత్త పాఠం చదవటం అంటే ఎలా అని కాని నిజమే రోజు కొత్త మనుషులను కలుస్తాం లేదా తెలిసిన వారి తోనే కొత్త గ ఏదైనా సంభాషణ మొదలు పెడతాము .కాని దీనిని మనమే గమనిన్చుకోము ఏదో ఒక కొత్త విషయం బహుశా మనం రోజు చూస్తున్న మనకి స్ఫురించానిది ,ఒక వేళ తట్టిన ఎదుటివారి అవహేళన చేస్తారన్న భయం చేతనో ,లేదా కొత్త పని చేయాలంటే జంకు చేతనో వెనుకంజ వేస్తాం అదే పని వేరేవెరో చేసాక అయ్యో ఇది నా ఆలోచన కొంచెం ధైర్యం చేసివుందల్సింది అని అనిపించినా అప్పటికే " వెళ్ళిపోయినా రైలు కి టికెట్ కొన్నట్టే " అందువల్ల మనకి తలంపు కు వచ్చింది కచితంగా మంచిది అనిపిస్తే ఎంత కష్టమైన ఆ పని ని అప్పుడే మొదలు పెట్టె ప్రయత్నం చేయాలి ఽది విజయవంతం అవుతుందా లేదా అనేది "ఫలితం దైవాధీనం " కాని ప్రయత్నా లోపం వుందా కూడదు . 

    అలంటి పనే నేను ఇవాళ చేస్తున్న ఎప్పటినుంచో న మనోభావాలను అందరితోను బ్లాగ్ రూపం లో పంచుకోవాలని ఆశ అదే ఇవాళ ఈ అక్షర రూపం