Saturday, 14 January 2017

మా ఊరి సంక్రాంతి

        సంవత్సరానికి ఒకసారి ,పంట చేతికి వచ్చి సిరులను తీసుకొచ్చే పండగ సంక్రాంతి.తెలుగు వారు  ప్రతి ఒక్కరు సంవత్సరం అంత ఎక్కడున్నా ఈ పండగ నాటికి పల్లె గూటికి చేరుకుంటారు. ఇందుకు మేము మినహాయింపు కాదుసుమండీ . సంక్రాంతి పండగ రాగానే నా మనసులో నా చిన్నపుడు తాతగారి ఊరు అయిన పెద్దబొడ్డేపల్లి అక్కడ జరిగి సందడే మెదుల్తుంది . ఈ రోజు కి ఇంకెక్కడా పండగ జరుపుకో బుద్ధి కాదు.
 
              ఇంచుమించు గా ధనుర్మాసం ప్రారంభం సమయం లో క్రిస్మస్ సెలవలు ఇచ్చేసేవారు మా స్కూల్ కి ,సెలవలు ఇచ్చి ఇవ్వంగనే ఊరికి పారి పోయే దాన్ని .అక్కడ నా కోసం ఎదురు చూస్తున్నారా అనిపించే  మా ఊరు ,మా తాతగారు బామ్మా ,మేనత్త చుట్టూ స్నేహితులు అబ్బా తల్చుకుంటుంటే మధురానుభూతులు కళ్ళు చెమ్మగీల్లుతాయి . ధనుర్మాసం నెల్లాళ్లు పొద్దునే మా అత్త బోల్డు చుక్కలతో రోజు కో ముగ్గు పెడుతూ ఉంటే తనకో బుల్లి అసిస్టెంట్ ని నేను, ముగ్గు పుత్తయ్యే లోపే ఎక్కడ నుంచో హరినామస్మరణ ఒక కంచు కంఠం వినిపించేది అది మరెవరో కాదు మా ఊరి హరిదాసు గారు ,ఆ గొంతు వింటూనే ఇంట్లో కి పరుగున పోయి బియ్యం పట్టుకొచ్చేసే వాళ్ళం ,ఆయనకీ బియ్యం వేయడం లో కూడా వంతులు  రోజు,అదో మజా . ఇహ పండుగ మూడు రోజులు కి తయారీ అయితే వారం ముందే మా బామ్మ గారు జంతికలు ,మిఠాయిలు స్వయంగా చేయడం తల్చుకుంటుంటే ఈ రోజు కి నోరూరిపోతుంది .
         భోగి రోజు తెల్లవారే భోగి మంటలు ,అవి పూర్తవ గానే శుభ్రంగా నలుగు తో తలంటి వంటి హడావిడీలు పూర్తి చేసేసరికి మా తాతగారు వంట గది లో చక్రపొంగలి చేయడం లో తలమునకలై వేండేవారు,ఆయన లో ఏ నలుడో భీముడొ పరకాయ ప్రవేశం చేసినట్టు చక్కగా పచ్చకర్పూరం ,జీడిపప్పు కిస్మిస్ పళ్ళు నేతి లో వేయించి ఉడుకుతున్న చక్రపొంగలి లో వేస్తూ ఉంటే మాకు తినాలి అనే ఆత్రం ఎక్కువై పోయేది ,అప్పుడు వచ్చేది అసలు సమస్య ఒక పక్క ప్రసాదం నోరూరిస్తుంటే దాని మా ఊరి రామాలయం లో ఆ ప్రసాదం స్వామి వారికి ఆరగింపుకి తీసుకెళ్లే భాద్యత నాది మా తమ్ముడిది ,అసలే చలి దానికి తోడు తలంటు కొత్త పట్టులంగా పావడ  సర్దుకుంటూ  గుడి కి జాగ్రత్తగా తీసుకెళ్లాలి.
             భోగి రోజు సాయంత్రం బ్రాహ్మణ వీధి (అది మా వీధి పేరు లెండి) లో భోగిపళ్లు పేరంటాళ్ళ హడావిడి మాటల్లో చెప్పలేము, మర్నాడు సంక్రాంతి రోజు సాయంకాలం మా ఊరు అయ్యప్ప స్వామి గుడి దగ్గర మకర జ్యోతి కార్యక్రమం సందర్భంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు,బాణ సంచా అది కూడా రావణుడు,పెద్ద నాగుపాము వంటి రకరకాల రూపాల్లో వెలుగుతుంటే  ,ఆ సందడి అంత కళ్ల  లో నింపుకొని ఊరంతా నడుచుకుంటూ ఎవరి గూటీకి వారు చేరే వాళ్ళం ,ఇంకా కనుమ రోజు నుంచి ఊరి లో వున్నా ప్రతి గుడి కి తీర్ధం జరిగేది,ఆ తీర్థం కూడా బ్రాహ్మణ వీధీ లోని రామాలయం తో నే  మొదలు,గుడి చుట్టూ రకరకాల ఆటలు,వస్తువులు ,తినుబండారాల అమ్మే చిన్న అంగళ్ళు,వాటి వద్ద  పొద్దుగుంకే దాకా అందరం ఆ తీర్ధము దగ్గరే ఉండేవాళ్ళం.

          పండగ నాలుగు రోజులు అయిపోయి ఊరికి తిరుగు ప్రయాణం అయ్యే రోజు చూడాలి ,అప్పటి దాకా వున్న సరదా అంతా మాయం అయిపోయి మనసు మారం చేస్తూ ఊరి జ్ఞాపకాల ని కాస్త పదిలంగా   మనసులో దాచుకుని ,ఎంత ఏడాది యిట్టె గడుస్తుందని సమాధాన పరుచుకుని బ్యాగ్ భుజానికేసుకుని స్కూల్ కి వెళ్ళేవాళ్ళం.